
ఈశ్వర్ సినిమాతో తెరంగేట్రం చేసిన ప్రభాస్ తోలి సినిమాతోనే మంచి గుర్తింపుతెచ్చుకున్నారు. తర్వాత వచ్చిన వర్షం సినిమాతో యూత్ హీరోగా, ఫ్యామిలీ హీరోగా, అమ్మాయిల కలల రాకుమారుడిలా మారిన ఆయన, ‘ఛత్రపతి’ చిత్రంతో మాస్ హీరోగా అందరికీ దగ్గరయ్యాడు.
‘దర్శక ధీరుడు’ రాజమౌళి గారి దర్శకత్వంలో ‘శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర’ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ గారు నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్,30,2005వ సంవత్సరంలో రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్ళ సునామి సృష్టించింది. అప్పటి వరకు ఉన్న 100డేస్,175డేస్ రికార్డ్లు అన్నీ ఈ చిత్ర విజయంతో ఒక్క సారిగా తుడిచిపెట్టుకుపోయాయి. ఎం.ఎం కీరవాణి గారు స్వరపరిచిన సంగీతం ఈ చిత్రానికి ప్రధానాకర్షణ. నేపథ్య సంగీతం ఈ సినిమాకు ప్రాణం పోసింది. ప్రభాస్ కెరీర్ లోనే ఒక మైలురాయిలా నిలిచిపోయే ఈ చిత్రం ప్రేక్షకుల మనస్సుల్లో చెరగని ముద్ర వేసింది. ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు సన్నివేశాలు ప్రేక్షకులని మునివేళ్ళపై నిల్చునేలా చేస్తాయి. నటుడిగా ప్రభాస్ ను మరో మెట్టు ఎక్కించిన చిత్రం ఛత్రపతి.ఈ చిత్రంలో సీనియర్ నటి భానుప్రియ గారు ప్రభాస్ తల్లి పాత్రలో నటించగా, విలన్ పాత్రలో నటించిన సుప్రీత్ మంచి పేరు సంపాదించుకున్నారు. ఇలా ఆ చిత్రంలో నటించిన వారికి, పనిచేసిన వారికి మంచి పేరు తీసుకురావడమే కాకుండా ఎన్నో మధురానుభూతులు మిగిల్చిన ఈ చిత్రం విడుదలై 15సంవత్సరాలు అవుతున్నా అది నమ్మశక్యం కాదు. అలాంటి “ఛత్రపతి” ప్రేక్షకుల మనస్సుల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది.