
మాధవన్ , రీమా సేన్ జంటగా నటించిన ప్రేమకథా చిత్రం చెలి. హ్యారిస్ జైరాజ్ అందించిన సంగీతం సూపర్ డూపర్ హిట్. ఈ సినిమా విడుదల సమయంలో ఎక్కడ విన్నా అవే పాటలు. యూత్ కి బాగా కనెక్ట్ అయిన మూవీ ఇది. మనోహరా, వర్షించే మేఘంలా నేనున్నా, ఓ వెన్నెల సోన పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. గౌతమ్ మీనన్ తెరకెక్కించిన చిత్రాల్లో చెలి సినిమాకి ఒక ప్రత్యేక స్థానం ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. మాధవన్,రీమా సేన్,
అబ్బాస్ మధ్య సాగే ముక్కోణపు ప్రేమకథా చిత్రమిది. తమిళంలో 'మిన్నలే', తెలుగులో'చెలి', హిందీలో 'రెహ్నా హై తేరే దిల్ మే' అనే పేర్లతో రూపోందిన ఈ కథ ప్రతి భాషలో సూపర్ హిట్ అయ్యింది. హిందీలో మాధవన్ (మ్యాడీ) ,దియా మీర్జా నటించారు. తెలుగు,తమిళ్ లోనే కాకుండా హిందీలో కూడా ఈ సినిమా ఆడియో పెద్ద విజయాన్ని సాధించింది. హ్యారిస్
జయరాజ్ ని టాప్ ప్లేస్ కి తీసుకెళ్ళిన చిత్రమిది. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో మాధవన్ 20 ఏళ్ల మిన్నలే (చెలి), 19 సంవత్సరాల 'రెహ్నా హై తేరే దిల్ మే అంటూ వేడుకలను ప్రారంభించారు. నెటిజన్లు కూడా 'చెలి' చిత్రాన్ని జ్ఞాపకం చేసుకుంటూ హ్యారీస్ జయరాజ్ సంగీతం గురించి కూడా కామెంట్స్ చేస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు.