
ఇన్స్టాగ్రామ్ లో బెల్లంకొండ శ్రీనివాస్ ను ఫాలో అవుతున్న వాళ్లకి తనలో ఈ లాక్ డౌన్ వల్ల వచ్చిన మార్పులు తెలిసే ఉంటాయి. ఈ లాక్ డౌన్ లో కసరత్తులు చేసి తనను తాను కొత్తగా తీర్చి దిద్దుకుంటున్నారు. కొద్దిగా సన్నబడి, మీసాలు గడాలు పెంచి మంచి రఫ్ లుక్ తో అభిమానుల ముందుకు వచ్చి, మునుపెన్నడూ లేనంత ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నారు. ఆయన ఇన్స్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు ఫోటోలు పోస్ట్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటారు.
కాగా ఇటీవలే అయన పత్రికా విలేకరులతో మాట్లాడుతూ “ఈ లాక్ డౌన్ నాకు, నా మీద ఎలా ప్రయోగాలు చేసుకోవాలో నేర్పింది, ‘రాక్షసుడు’ లాంటి ఇంటెన్స్ థ్రిల్లర్ తర్వాత ఒక మంచి ఆహ్లాదకరమైన కుటుంబ కథా చిత్రంతో మీ ముందుకు రాబోతున్నాను, దాని కోసమే నన్ను నేను ఇలా కొత్తగా మార్చుకుంటున్నా” అని ఆయన పేర్కొన్నారు. ఆయన ప్రస్తుతం ‘అల్లుడు అదుర్స్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన ఈ చిత్ర షూటింగ్ తిరిగి మొదలైంది. ఆ విషయమై ఆయన మాట్లాడుతూ “అల్లుడు అదుర్స్ చిత్రం నా మొదటి చిత్రమైన అల్లుడు శీను లాగా అందరినీ అలరించే చిత్రం, కరోనా విషయంలో అన్నీ జాగ్రత్తలూ పాటిస్తూ షూటింగ్ చేయడం కాస్త ఇబ్బంది కరమైన విషయమే అయినా ఆట సాగాలి కదా” అని ఆయన అన్నారు.