
యుగపురుషుడు ఎన్టీఆర్ అందించిన కళాఖండాలు ఎన్నో. వాటిలో ప్రత్యేకంగా నిలుస్తుంది నర్తనశాల. అదే నర్తనశాలను నందమూరి బాలకృష్ణ తన దర్శకత్వంలో మరోసారి తీయాలని చాలా ఉత్సాహం చూపించాడు. తన స్వీయ దర్శకత్వంలో తాను అర్జునుడిగా సినిమాను మొదలుపెట్టాడు కూడా. కాస్టింగ్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ద్రౌపదిగా సౌందర్యను తీసుకున్నాడు. భీముడిగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్ బాబులను తన సినిమా కోసం ఎన్నుకున్నాడు. ఈ సినిమా కొన్ని రోజులు షూటింగ్ కూడా జరిగింది.
అయితే అనివార్య కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ జరగకుండా ఆగిపోయింది. సౌందర్య, శ్రీహరి మన మధ్య లేకపోవడంతో బాలయ్య ఈ ప్రాజెక్టును పూర్తిగా పక్కకు పెట్టేసాడు. అయితే ఇన్నేళ్ల తర్వాత నర్తనశాల గురించి వార్త మళ్ళీ బయటకు వచ్చింది. ఈ నెల 24న శ్రేయాస్ ఈటీ యాప్ ద్వారా నర్తనశాల సినిమా కోసం షూట్ చేసిన ఫుటేజ్ ను విడుదల చేయనున్నారు. దీని ద్వారా వచ్చిన అమౌంట్ ను ఛారిటీ కోసం వాడతానని బాలయ్య తెలియజేసాడు. ఈరోజు అర్జునుడిగా బాలయ్య ఫస్ట్ లుక్ విడుదలైంది. అర్జునుడిగా బాలయ్య సరిగ్గా సరిపోయాడనే చెప్పాలి. మరి 24న విడుదల చేయనున్న 17 నిమిషాల ఫుటేజ్ లో ఎన్ని విశేషాలు ఉంటాయో చూడాలి.