
అమృత ప్రొడక్షన్స్, లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ల పై సందీప్ రాజ్ దర్శకత్వంలో దర్శకుడు, నిర్మాత, రచయిత హృదయకాలేయం, కొబ్బరి మట్ట ఫేమ్ సాయి రాజేష్, బెన్ని ముప్పానే తో కలసి, నిర్మించిన తాజా చిత్రం ’కలర్ ఫోటో’. 'ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య', 'మజిలీ' వంటి చిత్రాలలో తన నటనతో, కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులని నవ్వించిన నటుడు సుహాస్, గాడ్స్ ఆఫ్ ధర్మపురి, మస్తీస్ వంటి వెబ్ సిరీస్ లలో తన అభినయంతో ఆకట్టుకున్న తెలుగు నటి చాందినీ చౌదరి కలసి జంటగా నటించారు. సుహాస్ హీరోగా పరిచయమవుతున్న మొదటి చిత్రం ఇది. ప్రముఖ నటుడు సునీల్ ఒక ముఖ్య పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని ఈ నెల 23 న తెలుగు ఓ.టి.టి ఫ్లాట్ ఫామ్ ’ఆహా’ లో విడుదల కాబోతుందని నిర్మాతలు ప్రకటించారు.
ఈ సందర్భంగా సహ నిర్మాత, రచయిత సాయి రాజేష్ మాట్లాడుతూ “ఇంటర్నెట్ లేని కాలంలో ప్రేమలు ఎలా ఉండేవో, ప్రేమికులు ఎలా మాట్లాడుకునేవారో మా సినిమాలో అందంగా చూపించాం. కథ వినగానే సునీల్ గారు వెంటనే ఒప్పుకున్నారు. ఆయన ఈ సినిమా లో నటించడంతో సినిమాకి బలం పెరిగింది. రంగు వివక్ష గురించి నిజాయితీగా, నిక్కచ్చిగా చెప్పే ప్రయత్నం చేశాం. అలా అని ఇందులో సీరియస్ అంశాల్ని మేము స్పృశించలేదు. ప్రేక్షకులకు కావల్సినంత వినోదాన్ని, భావోద్వేగాల్ని పంచుతూనే మేము అనుకున్న విషయాన్ని సూటిగా చెప్పాం” అని ఆయన అన్నారు. మత్తు వదలరా లాంటి హిట్ సినిమా తర్వాత కాలభైరవ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్రానికి దర్శకుడు సందీప్ రాజ్, ఛాయాగ్రహణం వెంకట్.ఆర్.శాఖమూరి.