
గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుం, లాంటి వైవిద్యభరితమైన చిత్రాలతో ప్రత్యేకమైన ముద్ర వేశారు దర్శకడు క్రిష్. ఆ తర్వాత ఆయన తీసిన పీరియాడిక్ చిత్రమైన ‘కంచె’ ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారం అందుకుంది. బాలకృష్ణ ప్రధాన పాత్రలో క్రిష్ తెరకెక్కించిన హిస్టారికల్ చిత్రమైన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రాన్ని కేవలం 80 రోజులలోనే పూర్తి చేసారు క్రిష్. తాజాగా యువ కథానాయకుడు వైష్ణవ్ తేజ్ ప్రధాన పాత్రలో ఓ చిత్రన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తున్నారు. టాలీవుడ్లో శరవేగంగా సినిమా షూటింగ్లు చేసే దర్శకులు కొందరు ఉన్నారు. వారిలో పూరీ జగన్నాథ్, క్రిష్ వంటి దర్శకులు నెలరోజుల్లోనే సినిమాని పూర్తి చేస్తుంటారు. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి నిర్మాతల దర్శకుడు. నిర్మాతకు ఖర్చు మిగులుస్తూ చిత్రీకరణ చేయగల మహా మేథావి. వైష్ణవ్ తేజ్ తో ఆయన తెరకెక్కిస్తున్న చిత్రం ప్రస్తుతం వికారాబాద్ అడవుల్లో చిత్రీకరణ జరుపుకుంటోంది. తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు కొన్ని సినిమా షెడ్యూల్స్ వాయిదా పడ్డాయి. రవితేజ ‘క్రాక్’ చిత్రీకరణను ఇండోర్లో సెట్స్ వేసి చేస్తున్నారు. క్రిష్ అండ్ కో మాత్రం వర్షంలోనూ ఆగలేదు. కేవలం 35 రోజుల్లో ఒక్క పాట మినహ ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేశారు. ఈ సినిమాలో కథాపరంగా కొన్ని సన్నివేశాలను వర్షంలో చిత్రీకరించాలట. అందుకోసం రెయిన్ ఎఫెక్ట్ కృత్రిమంగా సృష్టించకుండా సహజంగా కురుస్తున్న వర్షాల్లో షూట్ చేశారు. ప్రముఖ రచయిత సన్నపురెడ్డి వెంకటరామి రెడ్డి గారు రచించిన నవల ‘కొండపోలం’ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి జ్ఞానశేఖర్ చాయగ్రహకుడిగా చేస్తుండగా కీరవాణీ సంగీతం అందిస్తున్నారు.