
ఎస్.ఎస్.రాజమౌళి, ఓటమి ఎరుగని దర్శకుడిగా ఆయన అందరికీ సుపరిచితం. ఆయన తెరకెక్కించిన చిత్రాలన్నీ విజయవంతమైనవే. ఆయన తీసిన చిత్రాలు ప్రేక్షకుల మనస్సుల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి.
అక్టోబర్-10-1973వ సంవత్సరంలో రాయచూరు జిల్లాలోని, మనవి ప్రాంతంలో కొవ్వూరు వాస్తవ్యులైన ప్రముఖ తెలుగు సినీ కథారచయిత కె.వి.విజయేంద్ర ప్రసాద్, రాజ నందిని దంపతులకు ఆయన జన్మించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరులో ప్రాధమిక విద్యను, ఏలూరులో ఉన్నత విద్యను అభ్యసించిన ఆయన సినిమా రంగం పై ఉన్న మక్కువతో ‘కె.రాఘవేంద్రరావు’ గారి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసారు. ఆ తర్వాత కొన్ని యాడ్ ఫిలిమ్స్ డైరెక్ట్ చేసిన ఆయన రాఘవేంద్రరావు గారు నిర్మించిన ‘శాంతి నివాసం’ సీరియల్ ను తెరకెక్కించారు. ఆ తర్వాత జూనియర్ ఎన్.టి.ఆర్. హీరోగా 2001లో తెరకెక్కిన స్టూడెంట్ నెం.1 చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత 2003లో వచ్చిన ‘సింహాద్రి’ చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలో ప్రకంపనలు సృష్టించారు. ఆ చిత్రం తర్వాత 2004లో వచ్చిన ‘సై’ చిత్రంతో అగ్ర దర్శకుల్లో ఒకరయ్యారు. వరసగా ఆయన తీసిన ఛత్రపతి, విక్రమార్కుడు చిత్రాలు కూడా ఘన విజయాలు సాధించి ట్రెండ్ సెట్టర్స్ అయ్యాయి. ఆ తర్వాత యమదొంగ, మగధీర, మర్యాద రామన్న, ఈగ, బాహుబలి: ది బిగినింగ్, ది కన్క్లూజన్ చిత్రాలను తెరకెక్కించారు.
జూనియర్ ఎన్.టి.ఆర్ తో ఆయన కాంబినేషన్ లో వచ్చిన ‘యమదొంగ’ మంచి విజయం సాధించడమే కాకుండా అప్పటికి మునుపెన్నడూ చూడని కొత్త జూనియర్ ఎన్.టి.ఆర్ ని మనకు పరిచయం చేసింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రెండో సినిమాగా తెరకెక్కిన మగధీర చిత్రం ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా రికార్డ్ నెలకొల్పింది. ఆ చిత్రం కొరియోగ్రఫీ విభాగంలో ఉత్తమ చిత్రంగా జాతీయ పురస్కారం అందుకుంది. ప్రముఖ హాస్యనటుడు సునీల్ కథానాయకుడిగా ఆయన తెరకెక్కించిన మర్యాద రామన్న చిత్రం ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించింది. ఆ తర్వాత వచ్చిన ‘ఈగ’ చిత్రం ఆయనలోని దర్శకత్వ ప్రతిభకు నిదర్శనం. అప్పటి వరకూ తెలుగులో రాని అద్భుతమైన గ్రాఫిక్స్ తో వచ్చిన ఈ చిత్రం ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారం అందుకుంది. అంతర్జాతీయ కేన్న్(cannes) ఫిల్మ్ ఫెస్టివల్ ల్లో ప్రదర్శితమైంది. ఆ తర్వాత ఆయన దర్శకత్వంలో లార్జర్ ద్యాన్ లైఫ్ గా తెరకెక్కిన బాహుబలి సిరీస్ ప్రపంచ వ్యాప్తంగా ప్రదర్శితమై తెలుగు పరిశ్రమ అంటే ఏంటో ప్రపంచానికి తెలియజేసింది. బాహుబలి: ది బిగినింగ్ చిత్రం ఉత్తమ చిత్రంగా జాతీయ పురస్కారం అందుకుంది. ఇప్పటి వరకూ ఒక్క పరాజయం కూడా చవిచూడకపోవడం ఆయన ప్రత్యేకత. తన ప్రతీ చిత్రంలో చిత్ర విచిత్రమైన ఆయుధాలను కథానాయకుని చేత ధరింపజేస్తారు. ఆయన తెరకెక్కించిన బాహుబలి (ది బిగినింగ్), బాహుబలి (ది కంక్లూజన్) సినిమాలు ప్రభంజనం సృష్టించాయి. బాహుబలి (ది కంక్లూజన్) చిత్రం ప్రపంచవ్యాప్తంగా అక్షరాలా 1800 కోట్ల రూపాయలు వసూళ్లు సాధించింది. ప్రస్తుతం ఆయన ఎన్.టి.ఆర్, రామ్ చరణ్ లు కథానాయకులుగా ఆర్.ఆర్.ఆర్ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. దాదాపు 400కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కనుంది. అంతటి అద్భుతమైన ప్రతిభ గల దర్శకుడైన రాజమౌళి గారికి భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.