
‘చి.ల.సౌ’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు యువ కథానాయకుడు అక్కినేని సుశాంత్. సుశాంత్, అందాల తార మీనాక్షి చౌదరి నాయికానాయకులుగా, ఎస్.దర్శన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. A1 స్టూడియోస్, శాస్త్రా మూవీస్, పతాకాలపై రవిశంకర్ శాస్త్రీ, హరీష్ కోయలగుండ్ల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది సంక్రాంతికే మొదలుపెట్టినా, లాక్ డౌన్ కారణంగా షూటింగ్ వాయిదాపడింది. ఇటీవలే షూటింగ్ ప్రారంభించి సేఫ్టీ మేజర్స్ పాటిస్తూ ఒక షెడ్యూల్ ను చిత్ర బృందం పూర్తి చేసింది.
కాగా ఈ చిత్ర చివరి షెడ్యూల్ మొదలవ్వబోతున్నట్లు ఈ చిత్ర కథానాయకుడు సుశాంత్ వెల్లడించారు. రెండ్రోజులుగా కురుస్తున్న భారి వర్షాల సందర్భంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా రెండు ఫోటోలను షేర్ చేస్తూ “ వర్షం వచ్చినా మా షూటింగ్ కొనసాగుతూనే ఉంది. సినిమా చివరి దశకు చేరుకున్నాం” అంటూ ఆయన ట్వీట్ చేశారు. వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు చిత్ర బృందం కృషి చేస్తోంది.