గాన గాంధర్వుడు ఇక లేరు.

తన సుస్వరంతో శ్రోతల హృదయాలను మీటే గాన గాంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గారు ఈ రోజు 1:04 నిమిషాలకు చెన్నై లోని ఎం.జి.ఎం ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు.

ఆయన గొంతు సవరిస్తే కోయిల సైతం చిన్నబోతుంది. ఆయన స్వరం వింటే కోట్లాది మంది హృదయాలలో సప్త స్వరాలు రాగాలు తీస్తాయి. కళా ప్రపూర్ణ, గాన గాంధర్వుడు, గాన విధూషి, సుస్వర మాంత్రికుడు శ్రీ శ్రీపతి పండితారాధ్యుల బాల సుబ్రహ్మణ్యం గారు.

04-06-1946. ఇప్పటి తిరువళ్ళురు జిల్లాలోని కోనేటమ్మపేట గ్రామంలో ఎస్పీ సాంబమూర్తి, శకుంతలమ్మ దంపతులకు ఆయన జన్మించారు. సంగీతం మీద ఉన్న మక్కువతో ఇళయరాజా గారితో కలిసి ఒక మ్యూజిక్ ట్రూప్ ని ఏర్పాటు చేసి వివిధ ప్రాంతాలలో సంగీత కచేరీలు ఇచ్చేవారు.

ఎస్పీ కోదండపాణి, ఘంటసాల గార్లు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన ఒక కచేరీలో వాళ్ళ దృష్టి ఆకర్షించి కోదండపాణి గారి దగ్గర శిష్యరికం చేశారు. ఎస్పీ కోదండపాణి గారు స్వరపరిచిన శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న సినిమాతో అరంగేట్రం చేసి మొదటి సినిమాతోనే తనదైన ముద్ర వేశారు. కె. విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన  శంకరాభరణం సినిమాలోని ఓంకార నాదం పాటకు గాను మొట్టమొదటి సారి జాతీయ పురస్కారం గెలుచుకున్న ఆయన ఆ తర్వాత సాగర సంగమం, స్వాతిముత్యం, రుద్రవీణ చిత్రాలకు జాతీయ పురస్కారాలు అందుకున్నారు.

ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ " తెలుగువారి ఆరాధ్య స్వరం మూగబోయింది, ఈ భువిలో సంగీతం ఉన్నంతకాలం మీరు అమరులే" అని ఆయన తన బాధను వ్యక్తపరిచారు."ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గారి వియోగం తీరని లోటు భారతీయ సంగీత ప్రపంచానికి ఇది చీకటి రోజు" అని ఆయన అన్నారు."ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన పాడిన పాటలు గుర్తుండిపోతాయని" రామ్ గోపాల్ వర్మ గారు ట్వీట్ చేశారు.ఎన్నో పాటలతో ప్రేక్షకులను రంజింపజేసిన  ఆయన మరణం బాధాకరం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భారతీయ సినీ ప్రముఖులు తమ సంతాపం తెలియజేసారు.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.