
మెగా ఫ్యామిలీ నుండి ఇప్పటికే చాలా మంది హీరోలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ హీరోలుగా పరిచయమయ్యారు. ఈ కోవలోనే చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఎక్కడో క్రికెట్ ఆడుకుంటున్న తేజ్ ను వైవిఎస్ చౌదరి చూసి ఈ కుర్రాడు తన సినిమాకు బాగుంటాడు అని పిలిపించి రేయ్ సినిమా చేస్తావా అని అడగడం, ఆ తర్వాత అతనే చిరు మేనల్లుడు అని తెలియడం జరిగాయి. అయితే అనుకోకుండా చౌదరి గారి రేయ్ ఆర్ధిక ఇబ్బందుల కారణంగా షూటింగ్ సజావుగా జరగలేదు. అయితే రేయ్ కంటే ముందే పిల్లా నువ్వు లేని జీవితం విడుదలైంది. అది కూడా తన మంచికే అయింది. ఆ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది.
సాయి ధరమ్ తేజ్ కు కెరీర్ లో హిట్స్ త్వరగానే వచ్చాయి. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఆ తర్వాత నుండే తేజ్ కు సినిమా కష్టాలు అంటే ఏంటో తెలిసాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు సినిమాలు ప్లాపయ్యాయి. దీంతో హీరోగా బాగా డౌన్ అయ్యాడు. పోయిన చోటే వెతుక్కోవాలన్న సామెతను ఫాలో అయిన తేజ్, అధైర్యపడకుండా 2019లో కథను నమ్మి చేసిన సినిమాలు చిత్రలహరి, ప్రతిరోజూ పండగే తనకు మంచి విజయాలను అందించాయి.

ఈ రెండు సినిమాలతో తేజ్ కు సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది. తిరిగి ఫామ్ అందుకున్నాక తేజ్ ప్రయాణం సరికొత్తగా సాగుతోంది. కథకు ఇంపార్టెన్స్ ఇచ్చి కొత్తవారితో పనిచేయడానికి కూడా వెనుకాడట్లేదు. ప్రస్తుతం కొత్త దర్శకుడితో సోలో బ్రతుకే సో బెటర్ చేసాడు. తర్వాత ప్లాఫుల్లో ఉన్న దేవా కట్టాతో పొలిటికల్ థ్రిల్లర్ చేయనున్నాడు. ఆ తర్వాత మరో కొత్త దర్శకుడితో మిస్టిక్ థ్రిల్లర్ ను ప్లాన్ చేసాడు. ఇలా తేజ్ ప్రయాణం మరింత సాఫీగా సూపర్ హిట్స్ తో ముందుకెళ్లాలని కోరుకుంటూ తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాం.