
మెగాస్టార్ చిరంజీవి నటుడిగా ప్రాణం పోసుకుని సెప్టెంబర్ 22 నాటికి 42 సంవత్సరాలు.
ఇంతింతై నటుడింతై...అన్నట్టుగా సాగింది చిరంజీవి జీవితం. 'ప్రాణం ఖరీదు' అనే సినిమాతో ప్రారంభమైన ఆయన జీవితం ఎందరికో ఆదర్శం.
కష్టాన్ని నమ్ముకుంటే వచ్చే ఫలితానికి తనే ఓ గొప్ప నిదర్శనం. రాయలంటే పేజీలు సరిపోని కష్టం ఆయనది.
నిరంతరం ప్రేక్షకులని అలరించేందుకు తను శ్రమించిన విధానాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవు. ఎన్ని సినిమాలు,ఎన్ని పాత్రలు,ఎన్ని పాటలు
ఎంతటి సమయస్ఫూర్తి, ఎంతటి నిబద్దత,ఎంత పట్టుదల,ఎంత కృషి,ఎంత ఓర్పు,ఎంత సహనం,ఎంత సాహసం.
"ప్రాణం ఖరీదు" నుంచి ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న "ఆచార్య" వరకు తన 42 ఏళ్ల కెరీర్లో చిరంజీవి 152 సినిమాల్లో నటించారు.ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండానే ఎన్నో ఆటుపోట్లను దాటుకుని ప్రేక్షకుల హృదయాల్లో 'మెగాస్టార్' గా సుస్తిర స్థానాన్ని సంపాదించుకోవడం అనేదే ఒక చరిత్ర.కొంతమంది చరిత్ర సృష్టించడానికే పుడతారు. అలా సెప్టెంబర్ 22 న 'ప్రాణం ఖరీదు' తో ప్రారంభమైన తన జైత్రయాత్ర అప్రతిహతంగా సాగిపోతునే ఉంది.
"ప్రాణం ఖరీదు" 1978 సెప్టెంబర్ 22న విడుదలైంది. కె.వాసు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం లో చిరంజీవి, జయసుధ, రావుగోపాల్రావు, చంద్రమోహన్, రేష్మా రాయ్ తదితరులు నటించారు.ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ... చిరంజీవి...
‘నా జీవితంలో ఆగస్ట్ 22కి ఎంత ప్రాముఖ్యత ఉందో సెప్టెంబర్ 22కి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ఆగస్టు 22 నేను మనిషిగా ప్రాణం పోసుకుంటే, సెప్టెంబర్ 22 న నటుడిగా ప్రాణం పోసుకున్న రోజు. నా తొలి చిత్రం' ప్రాణం ఖరీదు' విడుదలైన రోజు.
నన్ను ఇంతగా ఆదరించి ఈ స్థాయికి చేర్చిన సినీ ప్రేక్షకులందరికి, ముఖ్యంగా నా ప్రాణానికి ప్రాణమైన నా అభిమానులందరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అంటూ... మెగాస్టార్ ట్వీట్ చేశారు.
అదే ఎనర్జీతో ఇంకా ఎన్నో మంచి మంచి పాత్రల్లో నటిస్తూ...ప్రేక్షకులని, అభిమానులని అలరిస్తూనే ఉండాలని కోరుకుందాం.