
మహానటి సినిమా తర్వాత హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలకు కీర్తి సురేష్ కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయారు. ఈ భామ నటించిన తాజా చిత్రం ‘మిస్ ఇండియా’ విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. వచ్చే నెల 4న ‘మిస్ ఇండియా’ నెట్ ఫ్లిక్స్ లో విడుదలవుతోంది. నరేంద్ర నాథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా కీలక పాత్రల్లో జగపతి బాబు, నవీన్ చంద్ర తదితరులు నటించారు. మహేష్ ఎస్. కోనేరు ఈ సినిమాను నిర్మించారు. కార్పొరేట్ వ్యాపారానికి సంబంధించిన బ్యాక్ డ్రాప్ తో మిస్ ఇండియా తెరకెక్కిన విషయాన్ని ఇటీవలే విడుదలైన టీజర్ తో రివీల్ చేసారు. ఇక రిలీజ్ కు ముందు సినిమాకు హైప్ తీసుకురావడానికి ఈ చిత్రంలోని లచ్చ గుమ్మాడి సాంగ్ ను విడుదల చేసారు. ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్న తమన్ ఈ పాటను కూడా అందంగా ట్యూన్ చేసారు. అయితే పాట మొదట్లో వకీల్ సాబ్ లోని మగువా మగువా ట్యూన్ ను తలపిస్తుంది. అయితే మొత్తంగా తమన్ మరోసారి సూపర్ హిట్ సాంగ్ ఇవ్వడంలో సక్సెస్ అయ్యారు. కల్యాణ్ చక్రవర్తి ఈ పాటను రచించగా శ్రీ వర్దిని ఆలపించారు.