ఈ మధ్య కాలంలో ఒ.టి.టిల్లో సినిమాలు ఎక్కువగా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పడు ఈ జాబితాలో మరో కొత్త తెలుగు సినిమా చేరింది. ‘మహానటి’ లాంటి లేడీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ ఇప్పుడు ఇంకో లేడీ ఓరియెంటెడ్ సినిమాతో మన ముందుకు వస్తున్నారు అదే ‘మిస్ ఇండియా’. ఎప్పుడో ఫిబ్రవరిలో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా వల్ల పోస్ట్ పోన్ అవుతూ చివరికి నెట్ ఫ్లిక్స్ లో నవంబర్ 4న విడుదల అవ్వబోతోంది. ఈ మేరకు నేడు సినిమా ట్రైలర్ నెట్ ఫ్లిక్స్ లో విడుదలై, విడుదల తేదిని ఖరారు చేసుకుంది. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేష్ కోనేరు నిర్మించిన ఈ సినిమాకు నరేంద్రనాధ్ దర్శకుడు. విడుదల అయిన ట్రైలర్ ని చూస్తే సినిమాలో కీర్తి సురేష్ చాలా మంచి పాత్ర పోషించినట్టు తెలుస్తోంది.
చిన్ననాటి నుంచి ఎం.బి.ఎ చేసి తన సొంతంగా బిజినెస్ పెట్టాలి అనుకునే ఒక అమ్మాయి కథ అని ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. దాదాపుగా చాలావరకు విదేశాల్లో చిత్రీకరించిన ఈ సినిమాలో జగపతిబాబు, నవీన్ చంద్ర కీలకపాత్రల్లో నటించారు. తమన్ ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదల అయిన ఒక పాటకి చాలా మంచి స్పందన వచ్చింది. మహానటి సినిమాలో తన నటనకి జాతీయ అవార్డు అందుకున్న కీర్తి సురేష్, ఈ మిస్ ఇండియా సినిమాతో ఎన్ని ప్రశంసలు పొందుతారో చూడాలంటే నవంబర్ 4 వరకు వేచి చూడాలి.