
తన నటనతో, విభిన్న హావాభావాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారు న్యాచురల్ స్టార్ నాని. ‘అష్టాచెమ్మ’ చిత్రంతో తెరంగేట్రం చేసిన ఆయన తన మొదటి చిత్రంతోనే చక్కటి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత వచ్చిన రైడ్, భిమిలీ కబడ్డీ జట్టు, అలా మొదలైంది, పిల్ల జమీందార్ లాంటి చిత్రాలతో అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. ‘ఈగ’ చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ‘వెప్పం’ చిత్రంతో తమిళంలో కూడా ఆయన నటించారు.
ఇటీవలే ఆయన ‘V’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించారు. ప్రస్తుతం ఆయన శివ నిర్వాణ దర్శకత్వంలో ‘టక్ జగదీష్’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే మొదలై శర వేగంగా జరుగుతోంది. ఈ చిత్రం తర్వాత ఆయన వరసగా చిత్రాలను చేయనున్నారు. ‘టాక్సీవాలా’ చిత్రంతో ప్రేక్షకులకు సుపరిచితమైన దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రంలో ఆయన నటించనున్నారు. ఈ చిత్రం వీలైనంత త్వరలో సెట్స్ మీదకు వెళ్తుందని చిత్ర బృంద సమాచారం. ఈ చిత్రన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సుర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారు.