
నందమూరి బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో ప్రారంభించిన చిత్రం 'నర్తనశాల'.ఈ చిత్రంలో ద్రౌపది పాత్రలో నటించిన దివంగత నటీమణి సౌందర్య ప్రమాదవశాత్తు మరణించడంతో బాలకృష్ణ తన డ్రీమ్ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేశారు. కొంతవరకు షూటింగ్ చేసిన వీడీయోని అక్టోబర్ 24న ఉదయం 11.49 నిమిషాలకు ఎన్.బి.కె థియేటర్ లో, శ్రేయాస్ ఈటి ద్వారా విడుదల చేయనున్నారు. అయితే అక్టోబర్ 22న 'నర్తనశాల' 18 నిమిషాలు నిడివి గల వీడియో కి సంబంధించిన ట్రైలర్ ని విడుదల చేశారు. నందమూరి బాలకృష్ణ అర్జునుడిగా, దివంగత నటుడు రియల్ స్టార్ శ్రీహరి భీముడిగా, దివంగత నటీమణి సౌందర్య ద్రౌపదిగా ఉన్న పోస్టర్ లని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టర్ లకి సోషల్ మీడియా లో నెటిజన్ల నుండి చక్కని రెస్పాన్స్ లభించింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ లో విరాటపర్వంలోని పాండవుల అజ్ఞాతవాసానికి సంబంధించిన ఘట్టాన్ని చూపించారు.
“ఈ అజ్ఞాతవాసం విజయవంతంగా ముగియవలెనన్న నాపైనే ఎక్కువ భారం ఉన్నది” అని అర్జునుడి పాత్రధారి నందమూరి బాలకృష్ణ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమైంది. అలానే ద్రౌపది పాత్రధారి దివంగత నటీమణి సౌందర్య “పాండురాజు తనయులకు లేని కష్టం నాకా?” అని, భీముడి పాత్రలో దివంగత నటుడు శ్రీహరి “రాచబిడ్డ నై పుట్టినందుకు ఆవేశం సగపాలు, మీకు తమ్ముడిగా పుట్టినందుకు శాంతం సగపాలు వచ్చినవి” అని చెప్తారు. “ఆనాడు ఊర్వశి ఇచ్చిన శాపం ఈనాడు నాపాలిట వరమైనది. ఇక మన దాయాదులు ఎంతమంది వేగులను పంపినను, వాళ్ళ పాచికలు పారవు. ఎత్తుగడలు సాగవు. అని అర్జునుడి పాత్ర చెబుతుంది. ద్రౌపదీ సమేత మా పాండుకుమారుల తరపున మీకివే మా నమస్సుమాంజలులు” అని చెప్పడంతో ట్రైలర్ ముగుస్తుంది. చాలా కాలం తర్వాత దివంగత నటీమణి సౌందర్యని, దివంగత నటుడు శ్రీహరిని చూడటం జరిగింది. ఈ 18 నిమిషాల 'నర్తనశాల' వీడియోని చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారని తెలుస్తోంది.