కె. బాపయ్య

ప్రముఖ తెలుగు, హిందీ చిత్రాల దిగ్గజ దర్శకుడు. ఆయన దాదాపు 80 సినిమాలు తెరకెక్కించారు. భారతీయ సినిమా తొలితరం దర్శకులైన “కె.ఎస్ ప్రకాశరావు గారి కుమారుడు. ఆయన తీసిన ‘ప్రేమ్ నగర్’ సినిమాకు దర్శకత్వ విభాగంలో పనిచేసి అందులో మెళకువలు నేర్చుకున్నారు. ప్రముఖ నటులు జగ్గయ్య, వాణిశ్రీ, కృష్ణంరాజు ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన “ద్రోహి” చిత్రంతో దర్శకుడిగా వెండి తెరకు పరిచయమయ్యారు.
ఆ తర్వాత వరసగా ‘మేము మనుషులమే’, ‘ఎదురులేని మనిషి’, ‘ఊర్వశి’, ‘సోగ్గాడు’ చిత్రాలను ఆయన తెరకెక్కించారు. 1977 “దిల్ దార్” చిత్రంతో ఆయన బాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. తెలుగులో ఆయన దర్శకత్వంలోనే వచ్చిన సోగ్గాడు చిత్రానికి ‘దిల్ దార్’ హిందీ రీమేక్. ఆ చిత్ర విజయం, ఆయనకు బాలీవుడ్ లో నిలబడేలా చేసింది. తెలుగులో సినిమాలు చేస్తూ కూడా ఆయన బాలీవుడ్ సినిమాలు చేశారు. దిల్ దార్ చిత్రం తర్వాత ఆయన వరసగా బాలివుడ్ లో సినిమాలు చేశారు. దిల్ ఔర్ దీవార్, టక్కర్, బందిష్, సింధూర్ బనే జ్వాలా, మవాలి, మక్సద్, లాంటి చిత్రాలు ఎన్నో ఆయన హిందీలో తెరకెక్కించారు. వాటిల్లో కొన్ని తెలుగు రీమేక్ చిత్రాలు ఉన్నాయి. 1977లో మొదలు పెట్టి 3దశాబ్దాల పాటు ఆయన బాలివుడ్ లో సినిమాలు చేసారు. కమర్షియల్ ఫార్ములాతో విజయాల బాట పట్టి బాలివుడ్ లోని అనేక మంది స్టార్ హీరోలతో సినిమాలు చేసి అక్కడ విజయబావుటా ఎగురవేశారు.
బాపు

తెలుగునాట ఆయన పేరు ఎరుగనివారు ఉండరు. బహుముఖ ప్రజ్ఞాశాలి, రచయిత, దర్శకుడు, కార్టూనిస్ట్ అయిన “సత్తిరాజు లక్ష్మీ నారాయణ” గారు డిసెంబర్ 15 1933వ సంవత్సరంలో నర్సాపురంలో జన్మించారు. మద్రాస్ యూనివర్సిటీ నుంచి బి.కాం పట్టా పొందిన ఆయన ఆంధ్ర పత్రిక లో పొలిటికల్ కార్టూనిస్ట్ గా తన విధులు నిర్వహించారు. కొంతకాలం జె.వాల్టర్ థామ్సన్ సంస్థలోనూ, ఎఫిషియెంట్ పబ్లికేషన్స్ లోనూ, ఎఫ్.డి. స్టీవార్ట్స్ సంస్థలోనూ పనిచేశారు. తన సహచరుడైన ముళ్ళపూడి వెంకటరమణతో కలిసి రూపొందించిన బుడుగు పుస్తకం తెలుగు సాహిత్యంలో ఒక క్లాసిక్. ఇందులో బుడుగుతో పాటు “సిగానపెసూనాంబ” పాత్ర తెలుగు ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంది. ఆయన చిత్రాలు మన దేశంలోనే కాకుండా దేశదేశాలలో ఎన్నో ప్రదర్శనలలో కళాభిమానుల మన్నలందుకొన్నాయి.
1967వ సంవత్సరంలో సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల జంటగా ఆయన దర్శకత్వంలో వచ్చిన చిత్రం “సాక్షి”. ఆ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన మనవూరి పాండవులు చిత్రంలో మహా భారతాన్ని అప్పటి పరిస్థితులకి ఆపాదించి ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఆయన కూడా హిందీలో అడుగుపెట్టి ‘సీతా స్వయంవర్’, ‘సంపూర్ణ రామాయణ్’, ‘హమ్ పాంచ్’ ‘మొహబ్బత్’ ‘వొహ్ సాత్ దిన్’ లాంటి చిత్రాలను ఆయన తెరకెక్కించారు. అనిల్ కపూర్ లాంటి నటుణ్ణి వెండితెరకు పరిచయం చేశారు. రెండు తరాల నటులతో ఆయన ప్రయాణం మధురానుభూతమైనది.
సింగీతం శ్రీనివాసరావు

సింగీతం శ్రీనివాసరావు గారు 1931 సెప్టెంబరు 21న నెల్లూరు జిల్లా ఉదయగిరిలో జన్మించారు. తండ్రి ఒక హెడ్మాస్టరు. తల్లి వయొలిన్ వాయిద్య నిపుణురాలు. మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో చదివేటప్పుడు శ్రీనివాసరావుకు హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ పర్వేక్షణలో నాటకరంగంలో ప్రవేశం ఏర్పడింది. కళాశాల రోజుల్లోనే హాలీవుడ్ సినిమాలు బాగా చూసేవారు. డిగ్రీ పట్టా వచ్చిన తరువాత సూళ్ళూరుపేటలో ఉపాధ్యాయవృత్తిలో విధులు నిర్వహించారు . స్వయంగా రచించిన నాటకాలు (బ్రహ్మ, అంత్యఘట్టం) తన విద్యార్ధులతో ప్రదర్శింపచేసేవారు. రవీంద్రనాథ్ ఠాగూరు నాటకం ‘చిత్ర’ను ‘చిత్రార్జున’ అనే సంగీతనాటకంగా రూపొందించి ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు. ‘టామ్ బుచాన్’ అనే స్కాటిష్ నాటకకారుడు ఈ నాటకాన్ని ఆంగ్లంలోకి అనువదించి ఒక అమెరికన్ టెలివిజన్ ఛానల్లో ప్రసారం చేశాడు. కొంతకాలం శ్రీనివాసరావు గారు "తెలుగు స్వతంత్ర" పత్రికలో రచనలు (ప్రధానంగా ఇంటర్వ్యూలు) చేశాడు.
చలచిత్ర రంగంపై ఉన్న మక్కువతో దిగ్గజ దర్శకుడు కె.వి రెడ్డి గారి శిష్యరికంలో చేరారు. ఆయన తీసిన మాయాబజార్ మొదలుకుని ఎన్నో అపూర్వమైన చిత్రాలకు ఆయన దగ్గర సహాయ దర్శకునిగా పనిచేసారు. 1972వ సంవత్సరంలో ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘నీతి నిజాయితీ’ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత ఆయన ‘జమిందారు గారి అమ్మాయి’, ‘అమెరికా అమ్మాయి’ లాంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. ఆ తర్వాత ఆయన తీసిన ‘విచిత్ర సోదరులు’, ‘అమావాస్య చంద్రుడు’, ‘ఆదిత్య 369’, ‘మైకేల్ మదన కామ రాజు’, ‘భైరవ ద్వీపం’, ‘మయూరి’ చిత్రాలు వైవిధ్యభరితమైన చిత్రాలు. టైం ట్రావెలింగ్ నేపథ్యంలో వచ్చిన ‘ఆదిత్య 369’ దేశంలోనే మొదటి టైం ట్రావెల్ సినిమా. కమల్ హాసన్, నాజర్, మనీషా కోయిరాలా, ప్రధాన పాత్రల్లో ఆయన తెరకెక్కించిన ‘ముంబై ఎక్స్ప్రెస్’ చిత్రంలో కన్ఫ్యూజన్ కామెడితో ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకునేలా చేసారు. 1987వ సంవత్సరంలో కమల్ హాసన్, అమల జంటగా వచ్చిన మూకీ చిత్రం ‘పుష్పకవిమానం’ ఆయనలోని దర్శకత్వ ప్రతిభకు నిదర్శనం. ఈ చిత్రం గొప్ప విజయం సాధించడమే కాకుండా ఎన్నో ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శితమై అంతర్జాతీయంగా ఖ్యాతి గడించింది. ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ పై రామోజీరావు గారు నిర్మించిన ‘మయూరి’ ఉత్తమ చిత్రంగా ‘స్పెషల్ జ్యూరి’ పురస్కారం పొందింది. ప్రముఖ నృత్యకారిణి సుధా చంద్రన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో తన పాత్రలో సుధా చంద్రన్ గారే నటించడం విశేషం. కన్నడ పరిశ్రమలో అడుగుపెట్టి ఆయన తెరకెక్కించిన చిత్రం “హాలు-జేను”. కన్నడ సూపర్ స్టార్ ‘డా.రాజ్ కుమార్’ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం సంచలన విజయం నమోదు చేయడమే కాకుండా కన్నడ ప్రభుత్వంచే ఉత్తమ చిత్రంగా పురస్కారం పొందింది.
సింగీతం శ్రీనివాస రావు గారు 1982వ సంవత్సరంలో ‘త్రిలోక్ సుందరి’ చిత్రంతో బాలివుడ్ లో అడుగుపెట్టి పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. ఆ చిత్రం తర్వాత ఆయన మయూరి రీమెక్ గా నాచే మయూరి, పుష్పక్, ఫూల్, ముంబై ఎక్స్ప్రెస్, ఘటోత్కచ్ చిత్రాలను తెరకెక్కించారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన యానిమేషన్ చిత్రం ‘సన్ ఆఫ్ అల్లావుద్దీన్’ బాలల అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్’ లో ప్రదర్శితమైంది. ఒక్క భారతదేశంలోనే కాకుండా ఆయన ప్రతిభ అంతర్జాతీయంగా నలుదిశలా వ్యాపించింది. అంతటి గొప్ప దర్శకుడు మన తర తరాలకు ఆదర్శప్రాయులు.