
పవన్‌కల్యాణ్ 'వకీల్ సాబ్' సినిమా సెట్స్ పై ఉండగా, క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా, హరీశ్ శంకర్
దర్శకత్వంలో, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమాలు చేయబోతున్నట్లు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దసరా సందర్భంగా పవర్ స్టార్ చేయబోయే మరో సినిమాని అనౌన్స్ చేశారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. పవన్‌కల్యాణ్ ఇమేజ్ను దృష్టిలో పెట్టుకుని 'కింగ్ ఆఫ్ ఆట్యిట్యూడ్ తెలుగు సినిమా ఫేవరేట్ పోలీస్ ఆఫీసర్ మరోసారి హై ఓల్టేజ్ రోల్‌తో రాబోతున్నారు' అంటూ సినిమాకు సంబంధించిన ఒక చిన్న టీజర్ ని విడుదల చేసారు. అయ్యారే, అప్పట్లో ఒకడుండేవాడు లాంటి విభిన్నమైన చిత్రాలను తెరకెక్కించిన సాగర్ కె.చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వైవిధ్యభరితమైన కథలతో తనకంటూ ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకున్నారు దర్శకుడు సాగర్ కె.చంద్ర. ఈ చిత్రం మలయాళ చిత్రానికి రీమేక్ అని కొందరు అంటుండగా ఇంకా దీని గురించి ఆఫీషల్ గా ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ మధ్య వచ్చిన భీష్మ సినిమాని నిర్మించి మంచి హిట్ కొట్టిన సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాతో ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తుండగా, ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.