
హైదరాబాద్ ని అల్లకల్లోలం చేసి వెళ్ళిపోయిన వర్షం గురించి అందరికీ తెలిసిందే. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. వరద బాధితుల సహాయార్థం కోసం సీ.ఎం. కేసీఆర్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీనికి సినీపరిశ్రమ నుంచి అద్భుత స్పందన వచ్చింది. చాలా మంది సెలబ్రిటీలు విరాళాలిచ్చారు . పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా తనవంతు సాయంగా కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. అయినా సినిమావాళ్లు సరిగ్గా విరాళాలు ఇవ్వలేదని విమర్శలొచ్చాయి. దీనికి పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చారు. ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... సినిమా పరిశ్రమలో చాలా సంపద ఉందని సాధారణ ప్రజానీకం భావిస్తారు. అనుకోని కష్టంలో సినిమావాళ్లు సాయపడుతున్నా సరిపోయినంత ఇవ్వడం లేదని కొందరి విమర్శ.
సరిపోయినంత ఇవ్వలేదని అనేవాళ్లు వాళ్ల జేబులోంచి 10 రూపాయలైనా అయినా ఇచ్చారా? ఒక 10లక్షలు ఇవ్వాలంటేనే మనసు ఒప్పుద్దా? అలాంటిది నా వరకూ చూసుకున్నా సేవాభావంతో కోట్లు ఇచ్చాను. సొంత ఇంట్లో కష్టం వస్తే ఏం చేయాలో తెలీదు. అత్తారింటికి దారేది సినిమా ఇంటర్ నెట్ లో రిలీజైన సమయంలో థియేటర్ లలో రిలీజ్ చేయడానికే కష్టమైంది. నేనే సంతకం చేసి రిలీజ్ చేయించాల్సి వచ్చింది అని తెలిపారు. చాలా సున్నితమైన సినీపరిశ్రమను చాలా సులువుగా టార్గెట్ చేసేస్తారని అది సరికాదని, సినిమా ఇండస్ట్రీ పై విమర్శలు చేస్తున్న వారికి ఖచ్చితమైన జవాబు ఇచ్చే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్.