చిన్న సినిమాలు అయినప్పటికీ కొత్త రకం సినిమాలని ఎంచుకునే అక్కినేని సుమంత్, ప్రస్తుతం హీరోగా 'కపటధారి' అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కన్నడంలో విమర్శకుల ప్రశంసలు సైతం పొందిన సస్పెన్స్ థ్రిల్లర్ 'కవలుదారి' సినిమాకు తెలుగు రీమేక్. ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు ప్రదీప్ కృష్ణమూర్తి తెలుగులో దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్ర టీజర్‌ను గురువారం రానా దగ్గుపాటి విడుదల చేశారు. 'ఈ ప్రపంచంలో ఏదీ ఊరికే జరగదు. అన్నింటికి ఓ కారణం ఉంటుంది' అనే పాయింట్ ఆధారంగా టీజర్ అంతా సాగింది. ఇందులో చాలా సంవత్సరాల క్రితం జరిగిన ఓ హత్య కేసును పరిశోధించడానికి ప్రయత్నించే ట్రాఫిక్ పోలీస్‌గా సుమంత్ కనిపిస్తున్నారు. చివరగా 'వాడి అసలు మొహం దాచుకోవడానికి వేషాలు మార్చే వ్యక్తి' అనే డైలాగ్ తో పాటు మంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తో టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ సినిమాని థియేటర్ లో విడుదల చేస్తారో లేక ఓటీటీ లోనో తెలియాలి అంటే కొన్ని రోజులు ఆగాలి. ఈ కపటదారి సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని, త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని నిర్మాత డా॥ ధనంజయన్ తెలిపారు. ఈ చిత్రానికి మాటలు భాష్యశ్రీ, సంగీతం సైమన్కింగ్, స్క్రీన్‌ప్లే అడాప్షన్ జి.ధనంజయన్, కథ హేమంత్ ఎం రావ్. ఈ సినిమా టీజర్ చూస్తే కన్నడ సినిమాలో ఉన్న మేజిక్ ఈ సినిమాలో కూడా రిపీట్ అయ్యేలా ఉంది.