పాటే మంత్రంగా... సాగిన ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం ప్రస్థానం'

ఓంకార నాదానుసంధానమౌ గానమే...అంటూ పాటే మంత్రంగా...సాగిన ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం ప్రస్థానం మన అందరికీ తెలిసిందే. సంగీత దర్శకుల పాలిట కల్పవృక్షం తాను. ఎలాంటి పాటనైనా అవలీలగా, అందంగా, మధురంగా పాడి ఆ పాటకు ప్రాణం పోసి ఆ పాటకి ఒక చరిత్ర తీసుకొచ్చే ప్రయత్నం చేసేవాడు.పాటల కోసమే పుట్టిన పాటగాడు. శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం(బాలు)గా పిలువబడే ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం 1946 జూన్ 4 నెల్లూరు జిల్లా లోని కోనేటమ్మపేట గ్రామంలో శైవ బ్రాహ్మణ కుటుంబములో జన్మించాడు. తల్లిదండ్రులు:
శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి, శకుంతలమ్మ
భార్యా: సావిత్రి, పిల్లలు: చరణ్, పల్లవి గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, నటుడిగా, డబ్బింగ్ కళాకారుడిగా, నిర్మాతగా ఎన్నో సినిమాల ద్వారా తన బహుముఖ ప్రజ్ఞ ని చాటాడు.
నేపథ్యగాయకుడిగా... తెలుగు, తమిళ, కన్నడ, హిందీ లాంటి దాదాపు 15 భాషల్లో సుమారు 40 వేలకు పైగా పాటలు పాడాడు. ఇది ఎవరికీ సాధ్యం కాని ప్రపంచ రికార్డు.
తండ్రి హరికథా కళాకారుడు కావడంతో బాలుకు చిన్నప్పటి నుంచే సంగీతం మీద ఆసక్తి ఏర్పడింది. తండ్రి కోరిక మేరకు మద్రాసులో ఇంజనీరింగ్ కోర్సులో చేరాడు. చదువుకుంటూనే వేదికల మీద పాటలు పాడుతూ ఉండేవాడు తన ప్రతిభను ప్రపంచానికి చూపే ప్రయత్నం చేసేవాడు.ఒక వేదికపై బాలు పాడుతుండగా అతని గాత్రాన్ని విన్న సంగీత దర్శకుడు కోదండపాణి గారు బాలుకి మొదటి అవకాశాన్ని కల్పించారు. 1966లో మద్రాసులో ఎ.ఎం.ఐ.ఇ చదువుకుంటున్న రోజుల్లనే శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రంతో సినీగాయకునిగా పరిచయమయ్యాడు.
తనకు సినీ గాయకునిగా జీవితాన్ని ప్రసాదించిన సంగీత దర్శకుడు కోదండపాణిపై భక్తితో, తన ఆడియో ల్యాబ్ కు "కోదండపాణి ఆడియో ల్యాబ్స్" అని అతని పేరే పెట్టుకున్నాడు గురువుకు తగిన గౌరవం ఇచ్చాడు.
అమరగాయకుడు ఘంటసాల తరువాత తెలుగు సినీ పాటకు సిసలయిన వారసుడు దొరికాడని ఎంతోమంది కీర్తించారు.
40 ఏళ్ళ సినీప్రస్తానంలో 40 వేల పైచిలుకు పాటలను దాదాపు 15 భాషల్లో  పాడి, 40 సినిమాలకి సంగీత దర్శకత్వం వహించి ప్రపంచములోనే ఒక అరుదయిన రికార్డు సృష్టించాడు. తెలుగు, తమిళమే కాకుండా కన్నడంలో కూడా అతను పాడిన పాటలకి జాతీయ పురస్కారాలు లభించాయి. గాయకుడిగానే కాకుండా గాత్రదాన కళాకారుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా ఆయా విభాగాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించే నంది పురస్కారాన్ని 29 సార్లు అందుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి.
2016 నవంబరులో గోవాలో జరిగిన 47 వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో అతనికి శతవసంత భారతీయ చలనచిత్ర మూర్తిమత్వ పురస్కారాన్ని (సెంటినరీ అవార్డ్‌ ఫర్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌ 2016) ప్రదానం చేసారు.సుదీర్ఘ ప్రస్థానంలో 6 జాతీయ పురస్కారాలు, 6 ఫిల్మ్ ఫేర్ దక్షిణాది పురస్కారాలు, ఒక ఫిల్మ్ ఫేర్ పురస్కారం అందుకున్నాడు.
1979 లో వచ్చిన సంగీత ప్రధానమైన శంకరాభరణం చిత్రానికి ఆయనకు జాతీయ పురస్కారం లభించింది. రెండు సంవత్సరాల తర్వాత ఆయనకు 1981 లో బాలీవుడ్ లో ప్రవేశించి ఏక్ దూజే కేలియే చిత్రానికి గాను రెండోసారి జాతీయం పురస్కారం లభించింది. తర్వాత సాగర సంగమం (1983), రుద్రవీణ (1988) చిత్రాలకు జాతీయ పురస్కారాలు అందుకున్నాడు. 25 సార్లు ఉత్తమ గాయకుడిగా, ఉత్తమ సంగీత దర్శకుడిగా, ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్టుగా, ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాలు అందుకున్నాడు. ఇంకా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రప్రభుత్వాల నుంచి కూడా పలు పురస్కారాలు అందుకున్నాడు.
అంతే కాకుండా... 1999 లో పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ ని, 2001లో పద్మశ్రీ ని, 2011లో పద్మభూషణ్ లాంటి భారత ప్రభుత్వం అందించే విశిష్ట అవార్డులను అందుకున్నారు.
శతవసంత భారతీయ చలనచిత్ర మూర్తిమత్వ పురస్కారం (2016), కేంద్ర సమాచారా ప్రసార శాఖ మంత్రి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా అందుకున్నారు 1969లో వచ్చిన పెళ్ళంటే నూరేళ్ళ పంట అనే చిత్రంలో మొదటిసారిగా నటుడిగా కనిపించాడు బాలు. 1990 లో తమిళంలో వచ్చిన కేలడి కన్మణి అనే చిత్రంలో బాలు కథానాయకుడినా నటించాడు. ఇందులో రాధిక కథానాయిక. ఈ సినిమా తెలుగులో ఓ పాప లాలీ అనే పేరుతో అనువాదం అయింది. ఇంకా ప్రేమ (1989), ప్రేమికుడు (1994), పవిత్రబంధం (1996), ఆరో ప్రాణం (1997), రక్షకుడు (1997), దీర్ఘ సుమంగళీ భవ (1998) వంటి సినిమాల్లో ప్రాధాన్యత కలిగిన సహాయ పాత్రలు నటించాడు. 2012 లో తనికెళ్ళ భరణి దర్శకత్వంలో వచ్చిన మిథునం సినిమాలో కథానాయకుడిగా కనిపించాడు బాలు. ఇందులో లక్ష్మి నాయికగా నటించింది. ఈ సినిమాకు నంది ప్రత్యేక పురస్కారం లభించింది.
డబ్బింగ్ కళాకారుడిగా
కె. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన తమిళ అనువాద చిత్రం మన్మధ లీలతో బాలు అనుకోకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా మారాడు. అందులో కమల్ హాసన్ కు తెలుగులో డబ్బింగ్ చెప్పాడు. తర్వాత ఆయన కమల్ హాసన్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్, భాగ్యరాజ్, మోహన్, విష్ణువర్ధన్, జెమిని గణేశన్, గిరీష్ కర్నాడ్, అర్జున్, కార్తీక్, నగేష్, రఘువరన్ లాంటి వారికి పలు భాషల్లో గాత్రదానం చేశాడు. తమిళం నుంచి తెలుగులోకి అనువాదమయ్యే కమల్ హాసన్ చిత్రాలన్నింటికి ఈయనే డబ్బింగ్ చెబుతుండేవాడు. 2010లో కమల్ హాసన్ కథానాయకుడిగా వచ్చిన దశావతారం చిత్రంలో కమల్ పోషించిన పది పాత్రల్లో 7 పాత్రలకు బాలునే డబ్బింగ్ చెప్పడం విశేషం. ఇందులో కమల్ పోషించిన ముసలావిడ పాత్ర కూడా ఉంది. అన్నమయ్య చిత్రంలో సుమన్ పోషించిన వేంకటేశ్వర స్వామి పాత్రకు, సాయి మహిమ చిత్రంలో బాలు డబ్బింగ్ చెప్పాడు. ఈ రెండు చిత్రాలకు ఆయనకు ఉత్తమ డబ్బింగ్ కళాకారుడిగా నంది పురస్కారం లభించింది.
ఈటీవీలో 'పాడుతా తీయగా' అనే కార్యక్రమంతో బాలసుబ్రహ్మణ్యం బుల్లితెర ప్రవేశం చేసాడు. అనేక మంది కొత్త గాయనీ గాయకులను ఈ కార్యక్రమం ద్వారా పరిచయం చేసాడు. 1996 లో మొదలైన ఈ కార్యక్రమం ఇంకా కొనసాగుతూనే ఉంది.
ఇలా నిరంతరం పాట పాడుతూనో,పాటని కడుతూనో,నటిస్తూనో,పాత్రలకి డబ్బింగ్ చెబుతూ నో, నిర్మాతగా వ్యవహరిస్తూనో,దేశ విదేశాల్లో ప్రోగ్రామ్స్ ఇస్తూనో,పాడుతా తీయగా లాంటి కార్యక్రమాలు చేస్తూనో....తన జీవితమంతా ఏదో ఒక పనిలోనే గడిపాడు.అయినా ఎప్పుడూ అలసిపోయినట్టు కనిపించనే లేదు...తన జీవితం నవతరానికి ఎంతో ఆదర్శం.
శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం(బాలు)గారు మీరు ఎక్కడున్నా మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాము

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.