
సూపర్ స్టార్ ‘కృష్ణ’ ఈ పేరు వింటే అందరికీ మొదటగా గుర్తుకువచ్చేది థ్రిల్లర్ సినిమాలే. జేమ్స్ బాండ్ తరహా డిటెక్టివ్ చిత్రాలైన, కౌ బోయ్ తరహా చిత్రాలైనా మొట్టమొదట తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేసింది ఆయనే. ఆయన తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకోవడానికి ‘గూఢచారి 116’, ‘ఏజెంట్ గోపి’, ‘మోసగాళ్ళకు మోసగాడు’ చిత్రాలు చాల దోహడపడ్డాయి.
యాక్షన్ డైరెక్టర్ “కే.ఎస్.ఆర్.దాస్”గారి దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ, జయప్రద, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, ప్రధాన పాత్రల్లో నటిచిన చిత్రం ‘దొంగలకు దొంగ’. నిర్మాత డూండేశ్వర రావు గారి నిర్మాణంలో 1977 సెప్టెంబర్,29న రిలీజ్ అయిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. పుష్పాల గోపికృష్ణ గారు ఈ చిత్రానికి ఛాయాగ్రహకుడిగా పని చేసారు. చెల్లపల్లి సత్యం గారు స్వరపరిచిన సంగీతం ఈ చిత్రానికి ప్రధానాకర్షణగా నిలిచాయి.
అనుకోని కారణాల వల్ల తల్లితండ్రులను కోల్పోయి అనాధలుగా విడివిడిగా పెరిగిన అన్నదమ్ములు, తమ తల్లితండ్రులను చంపిన వారిపై ఎలా పగ తీర్చుకున్నారు అనేది కథ. తెలుగు సినిమాల్లో అప్పటి వరకు రాని కొత్త కథాంశంతో థ్రిల్లర్ తరహాలో సాగే ఫ్యామిలీ డ్రామా ఈ చిత్రం. కృష్ణ, మోహన్ బాబుల మధ్య వచ్చే సన్నివేశాలను ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా జయప్రదగారి నటన అద్భుతం. ఈ చిత్రం విడుదలై నేటికి 43సంవత్సరాలైంది. కాని ఇప్పటికీ ఈ చిత్రంలోని సన్నివేశాలు కొత్తగానే ఉంటాయి.