
“సోనూ సూద్” ఈ పేరు వింటే ముందుగా తెలుగు ప్రేక్షకులకి గుర్తొచ్చేది ‘అరుంధతి’ చిత్రంలో ప్రతినాయకుడి పాత్ర ‘పశుపతి’. వదల బోమ్మాళీ నిన్నొదలా అంటూ ఆయన ప్రేక్షకుల వెన్నులో దడ పుట్టించారు. ఆయన చేసిన విలన్ పాత్ర ఏదైనా అందులో జీవించి ప్రేక్షకులని మెప్పిస్తారు.
తెరపై అంత కర్కశంగా కనిపించే ఆయన బయట చాల మృదు స్వభావి, మంచి మనసున్న మనిషి. కరోనాతో లాక్ డౌన్ కారణంగా నగరాల్లో చిక్కుకుపోయిన వివిధ ప్రాంతాలకు చెందిన వలస కార్మికులనూ, కూలీలనూ, తమ స్వస్థలాలకు వెళ్ళాల్సిన ప్రజలనూ ఆయన తన సొంత ఖర్చుతో బస్సులు ఏర్పాటు చేసి వాళ్ళు తమ గమ్యాలను చేరుకునేలా సహాయం చేసారు. మూడు నెలల నిర్భందంలో ఆకలితో అలమటించిన ఎంతోమందికి ఆయన ఫుడ్ ప్యాకెట్లు పంపిణీ చేసారు. ఎంతోమంది అనాధలను కూడా ఆయన దత్తత తీసుకుని, వాళ్ళను చదివిస్తున్నారు. ఇలా ఎంతోమందిని ఎన్నో రకాలుగా ఆదుకున్న ఆపద్బాంధవుడు.
ఆయన చేసిన సేవలకు గాను ప్రతిష్టాత్మక ఎస్.డీ.జీ. స్పెషల్ హ్యుమానిటేరియన్ అవార్డ్ తో పంజాబ్ గవర్నమెంట్, ఎస్.డీ.జీ.సంస్థ ఆధ్వర్యంలో ఆయన్ను సత్కరించింది. కాగా ఈ అవార్డు అందుకున్నందుకు ఐరాస అనుబంధ సంస్థ అయిన “యూ.ఎన్.డీ.పీ” సంస్థ ఆయన చేసిన సేవలు అభినందనీయమైనవనీ పేదల పట్ల ఆయన చూపించిన ఆపేక్ష మరువలేనిదనీ ఆయన్ను అభినందించింది. ఈ విషయమై ఆయన స్పందిస్తూ తనకు అవార్డ్ రావడం సంతోషంగా ఉందనీ, ఫ్యుచర్లో ఇలాంటి పనులు ఇంకా చేస్తానని ఆయన అన్నారు.