
కమర్షియల్ సినిమాల చిరునామా వి.వి.వినాయక్ గారు. తెలుగు చిత్ర పరిశ్రమకు బ్లాక్ బస్టర్ మూవీస్ అందించిన దర్శకుడు. అక్టోబర్ 9 వి.వి.వినాయక్ పుట్టినరోజు. 2002లో జూనియర్ ఎన్.టి.ఆర్, కీర్తి చావ్లా జంటగా నటించిన ‘ఆది’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. బాక్సాఫీస్ వద్ద “ఆది” భారీ ప్రకంపనలు సృష్టించింది. జూనియర్ ఎన్.టి.ఆర్ కి స్టార్ స్టేటస్ తెచ్చిపెట్టిన సినిమా. వి.వి.వినాయక్ గారు ఈ చిత్రానికి ఉత్తమ తొలిచిత్ర దర్శకుడిగా రాష్ట్ర ప్రభుత్వం నుండి నంది అవార్డును కూడా అందుకున్నారు . తర్వాత చెన్నకేశవ రెడ్డి, దిల్, ఠాగూర్, సాంబ, బన్నీ, లక్ష్మి, యోగి, కృష్ణ, అదుర్స్, బద్రీనాథ్, నాయక్, అల్లుడు శీను, అఖిల్, ఖైదీ నంబర్ 150, ఇంటిలిజెంట్ సినిమాలకు దర్శకత్వం వహించారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, నితిన్, ప్రభాస్,రవితేజ వంటి నటులకు ఆయన పలు విజయవంతమైన సినిమాలు అందించారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘దిల్’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతగా దిల్ రాజు పరిచయమయ్యారు. మాస్ చిత్రాల్లో కామెడీని జోడించి బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన వి.వి.వినాయక్ ప్రస్తుతం శీనయ్య అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. త్వరలోనే ఆయన మెగా స్టార్ చిరంజీవి గారి సినిమాకి దర్శకత్వం వహించనున్నారు. వి.వి.వినాయక్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది మీడియా9 టాలీవుడ్.