
యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'ఫైటర్'. ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు. పూరీ కనెక్ట్స్ బ్యానర్ పై పూరీ, ఛార్మీలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహర్ కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నారు. ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ కఠినమైన శిక్షణ తీసుకున్నారు. తాజాగా విజయ్ దేవరకొండ 'ఫైటర్' సినిమా గురించి మరియు పూరీ జగన్నాథ్ ల గురించి చెప్పుకొచ్చారు. 'నేను ఈ సినిమా కోసం 8 నెలలు వర్కౌట్స్ చేశాను. అయితే ఈ మధ్య మోటివేషన్ కోల్పోయాను, మళ్ళీ ఇప్పుడు నాన్ స్టాప్ గా వర్కౌట్స్ కంటిన్యూ చేశాను. నేను ఈ మూవీలో ఒక ఫైటర్ పాత్రను పోషిస్తున్నాను. అది 6ప్యాక్ అయినా 8ప్యాక్ అయినా సరే నేను ఒకరిని మట్టికరిపించగల పోరాట యోధుడిలా కనిపించాలి'' అని విజయ్ దేవరకొండ అన్నారు.
ఈ సినిమా మనం రెగ్యులర్ గా చూసే కమర్షియల్ ఎంటర్టైనర్ కాదు. నా తరహాలో ఉండే కమర్షియల్ సినిమా అవుతుంది. నేను ఈ స్క్రిప్ట్ విన్నప్పుడే కమర్షియల్ జోనర్ లో ఇలాంటి సినిమానే చేయాలనుకున్నాను. అయితే కమర్షియల్ సెన్సిబిలిటీగా పేరుగాంచిన డైరెక్టర్ వల్ల ఈ చిత్రానికి మరింత కమర్షియల్ బ్యాకింగ్ వచ్చింది. ఇక డైరెక్టర్ పూరీ జగన్నాథ్ గారు నా ఫేవరేట్ డైరెక్టర్, ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘పోకిరి’ సినిమా చాలా ఇష్టం అని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు. ఇప్పటికే ముంబైలో భారీ షెడ్యూల్ ని జరుపుకున్న ఈ సినిమా షూటింగ్ ని తొందరగా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు.