
నట సామ్రాట్ కింగ్ నాగార్జున, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ విభిన్నమైన చిత్రాలని ప్రేక్షకులకు అందిస్తుంటారు. కెరీర్ స్టార్టింగ్ లో శివ లాంటి ఇండస్ట్రీ గేమ్ చేంజర్ సినిమాను చేసిన ఆయన, తర్వాత గీతాంజలి లాంటి క్లాసిక్ లవ్ స్టోరీ నీ అందించారు. మంచి కమర్షియల్ సినిమాలు చేసి హిట్స్ మీద ఉన్నప్పుడు అన్నమయ్య లాంటి భక్తి రస సినిమాలో నటించి తన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. అలాగే ఇప్పుడు "వైల్డ్ డాగ్" అనే ఒక అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమాలో విలక్షమైన పాత్ర చేస్తున్నారు. ఇందులో నాగార్జున N.I.A (నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ) లో A.C.P విజయ్ వర్మ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం తాజా షెడ్యూల్ మంచు ప్రాంతమైన మనాలీ లో ప్రారంభమైంది. సినిమాలో కీలకమైన సంఘటనలను నాగార్జున మరియు ముఖ్య తారాగణం పై ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. నాగార్జునకు జోడీగా దియా మిర్జా నటిస్తున్నారు. అలాగే సయామీ ఖేర్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మ్యాట్ని ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అహిషోర్ సాల్మన్ అనే నూతన దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నారు. వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు.